తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు బుధవారం ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఎక్కడా ఊరట లభించలేదు. కేసును రద్దు చేయాలంటూ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు ధర్మాసనం తొలుత విముఖత వ్యక్తం చేసింది. కేసు విచారణకు రాగానే ‘నాట్ బిఫోర్ మీ’ అంటూ జస్టిస్ భట్టి నిరాసక్తత వ్యక్తం చేశారు. దీంతో మరో న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా జోక్యం చేసుకొని తన సహచరుడు భట్టి సుముఖంగా లేనందున కేసును మరో బెంచ్‌కు బదిలీ చేస్తున్నట్టు వెల్లడించారు. చంద్రబాబు తరఫు న్యాయవాదులు కేసును చీఫ్ జస్టిస్ బెంచ్ వద్ద నివేదించారు. కాగా, ఈ సమయంలో క్వాష్ పిటిషన్‌ను అనుమతించవద్దని సీఐడీ తరఫు న్యాయవాదులు కోరారు.
ఈ కేసులో లోతైన విచారణ జరగాల్సి ఉందని అన్నారు. ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ.. ఏసీబీ కోర్టు విచారణ, పోలీసు కస్టడీ విచారణను తాము అడ్డుకోలేమని చెప్పారు. ఈ పిటిషన్‌పై అక్టోబర్ 3న ఏదో ఒక బెంచ్ విచారణ జరుపుతుందని స్పష్టం చేశారు. ఇక ఇదే కేసులో బెయిల్ కోసం చంద్రబాబు పెట్టుకున్న పిటిషన్‌పై విచారణను విజయవాడ ఏసీబీ కోర్టు అక్టోబర్ 4కు వాయిదా వేసింది. చంద్రబాబును మరో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా అదేరోజుకు వాయిదా వేసింది. రెండు పిటిషన్లపై ఒకేసారి వాదనలు వింటామని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి చెప్పారు. అమరావతి రింగ్‌రోడ్డు, ఫైబర్‌నెట్ కేసుల్లో పీటీ వారెంట్లపై విచారణను కూడా ఏసీబీ కోర్టు అక్టోబర్ 4కు వాయిదా వేసింది.