తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలలో ఇటీవల కాలంలో జరుగుతున్న వరుస సంఘటనలు బాధాకరమన్నారు. 15 రోజుల వ్యవధిలోనే టీటీడీ ఆరోగ్య అధికారి కారు, ధర్మరధంను దొంగలు ఎత్తుకెళ్ళడం భధ్రతా వైఫల్యమే కారణమన్నారు. తిరుమలలో దొంగతనాలను భక్తులు జీర్ణించుకోలేక పోతున్నారని తెలిపారు. భధ్రత విషయంలో రాజీ పడకుండా ఉండాల్సిన బాధ్యత టీటీడీపై ఉందన్నారు. టీటీడీ భధ్రతను కేంద్ర బలగాలకు అప్పగిస్తే మంచిదని భక్తులు భావిస్తున్నారన్నారు. శేషాచలంలో విలువైన కోట్ల రూపాయల ఎర్రచందనం దారి మళ్లుతోందన్నారు. ధర్మరధం, అధికారి కారు దొంగతనంపై లోతుగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. భధ్రతా లోపంపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. వేల సీసీ కెమెరాలు నిఘా ఉన్నా ఉపయోగం లేకుండా ఉందన్నారు. ధర్మరధంను ఎత్తుకెళ్తుంటే జీఎన్సీ టోల్ గేట్ వద్ద గానీ, అలిపిరి టోల్ గేట్ వద్ద సిబ్బంది ఎందుకు ఆపలేక పోయారని భానుప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు.