తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అవినీతికి పాల్పడి, అడ్డంగా దొరికిపోయి ప్రజల ముందు తలదించుకుని సిగ్గుపడాల్సిన వారు కంచాలు మోగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఆశ్చర్యంగా ఉందని నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అవినీతి చేసి కంచాలు కొట్టడం ఏమిటని.. తినేది లంచాలు.. మోగించేది కంచాలా? అంటూ ఆయన ప్రశ్నించారు. సిగ్గుపడాల్సిన చోట, తలదించుకోవాల్సిన చోట కూడా తల ఎగరేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అంబటి ఆ ప్రకటనలో ఇంకా ఏమన్నారంటే..టీడీపీ నేతల అహంకారాన్ని ప్రజలు మరింత అణచాల్సిన అవసరం ఉంది. 2014 నుంచి 2019 వరకు మోగించిన అవినీతి మోత కారణంగానే చంద్రబాబుకు ఇప్పుడు ఇంట్లో ఈగల మోత జైల్లో దోమల మోత.. అన్న పరిస్థితి వచ్చింది. చంద్రబాబును అరెస్టుచేసింది రాష్ట్ర సీఐడీ అన్నది ఎంత నిజమో, కోర్టులు తిరస్కరించటంవల్లే చంద్రబాబు ఈరోజు రిమాండ్‌లో ఖైదీగా ఉన్నారన్నది కూడా అంతే నిజం.