తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి కాగ్ ఇచ్చిన నివేదిక వాస్తవ పరిస్థితికి దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది. గత తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సృష్టించిన ఆర్ధిక అరాచకమే అమరావతి అని అర్దం అవుతుంది. లక్షల కోట్ల రూపాయలు ఒకే చోట గుమ్మరించడంపై రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లోనే వ్యతిరేకత వచ్చింది. దాని ఫలితమే 2019 శాసనసభ ఎన్నికలలో టీడీపీ ఘోర ఓటమి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం.. ఈ పరిస్థితిని మొత్తం సమీక్షించుకుని, జరిగిన అక్రమాలను గమనంలోకి తీసుకుని ఇక్కడే లక్షల కోట్లు వ్యయం చేసి, మిగిలిన ప్రాంతానికి అన్యాయం చేయలేమని భావించింది. ఇదే పాయింట్‌ను కాగ్ కూడా వెల్లడిస్తూ.. గత ప్రభుత్వంలో రాజధాని పేరుతో ఆర్ధిక అగాధాన్ని సృష్టించుకుంటున్నారని వ్యాఖ్యానించడం విశేషం.
అందుకే మూడు రాజధానుల ప్రతిపాదనను ప్రస్తుత ప్రభుత్వం తెరమీదకు తెచ్చింది. కానీ, దానిని ముందుకు సాగనివ్వకుండా ప్రతిపక్ష టీడీపీ న్యాయ వ్యవస్థ ద్వారా అడుగడుగునా అడ్డుపడింది. అయినా జగన్ పట్టు వీడక విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు దిశగా సాగుతున్నారు. అదే సమయంలో అమరావతిని శాసన రాజధానిగా కొనసాగించాలని తలపెట్టారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు విషయంపై స్పష్టతతో ఉన్నప్పటికీ.. ఇంకా పలు అవరోధాలు అధిగమనించవలసి ఉంటుంది. జగన్ విశాఖను పాలన రాజధానిగా చయాలని తీసుకున్న నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్ కు కనీసం లక్ష కోట్ల రూపాయల ఆదా అయినట్లు లెక్కవేసుకోవచ్చు. అదెలాగంటే..
టీడీపీ ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక ప్రకారం అయితే అమరావతి ప్రాంతంలో వివిధ మౌలిక సదుపాయాలకు లక్ష తొమ్మిదివేల కోట్లు అవసరమవుతాయి. ఇది తొలిదశకు మాత్రమే. ఆ మేరకు కేంద్రం నిధులు మంజూరు చేయాలని ఆనాటి సీఎం చంద్రబాబు లేఖ కూడా రాశారు. కేంద్రం ఆ లేఖను పక్కన పెట్టేసింది.అప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 1,500 కోట్ల రూపాయల డబ్బు ఎలా ఖర్చు పెట్టారో కూడా టీడీపీ ప్రభుత్వం వివరించలేదు. అప్పులు తెచ్చి తాత్కాలిక భవనాలు నిర్మించింది. బాండ్లు విడుదల చేసి వేల కోట్ల రూపాయలను వెచ్చించడానికి సన్నద్దమై సుమారు 33 వేల కోట్ల రూపాయల విలువైన టెండర్లు పిలిచింది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలలో అప్పట్లో నిరసన వచ్చింది. కేవలం ఒక వర్గం ప్రయోజనాల కోసం చంద్రబాబు ఇలా చేస్తున్నారని మెజార్టీ ప్రజలు భావించారు.ప్రజాభిప్రాయానికి తగినట్లే ఇప్పుడు కాగ్ నివేదికలోని అంశాలు ఉన్నాయని అనిపిస్తుంది.
అమరావతి రాజధాని నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రమైన ఆర్దిక భారం మోపుతుందని కాగ్ పేర్కొంది. రెండు దశాబ్దాల క్రితం దేశంలో మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి. అవి జార్ఖండ్, చత్తీస్ గడ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు. వీటిలో ఎక్కడా ఈ రకంగా 55 వేల ఎకరాలలో రాజధాని ప్రతిపాదించలేదు. రైతుల నుంచి 33 వేల ఎకరాలను తీసుకోలేదు.కేవలం రాజధానికి అవసరమైన రెండువేలు లేదా మూడు వేల ఎకరాలలో మాత్రమే నిర్మాణాలు చేసుకున్నారు. మంచి నగరాన్ని ఎంపిక చేసుకుని పాలన సాగించారు తప్ప ఇలా కొత్త రాజధాని నగర నిర్మాణమే చేస్తామంటూ ఎవరూ ఎచ్చులకు పోలేదు. ఛత్తీస్‌గడ్ రాజధాని రాయపూర్ వద్ద నయారాయయపూర్ పేరిట తీసుకున్న భూమిలోనే పూర్తి స్థాయి నిర్మాణాలు జరగలేదట. అలాంటిది ఇక్కడ అమరావతిలో ఇన్నివేల ఎకరాల భూమిని తీసుకుని మొత్తం ప్రాజెక్టును రియల్ ఎస్టేట్ వెంచర్ మాదిరి చేసి, ధరలను హైప్ చేసి, ఇన్ సైడ్ ట్రేడింగ్ కు పాల్పడి, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లను తమకు కావల్సిన విధంగా మార్చుకుని ఓ భారీ స్కామ్ గా మార్చారు.